పదవీ విరమణ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్
శ్రీకాకుళం, జూలై 31
క్రమ శిక్షణ, అంకిత భావంతో విధులు నిర్వహించడంలో జిల్లా రెవెన్యూ అధికారి మొల్లేటి గణపతిరావు ముందు వరుసలో ఉంటారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రశంసించారు. డిఆర్ఓగా గణపతి రావు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధికారుల సంఘము నిర్వహించిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించడంలో రెవెన్యూ శాఖ కీలకమైనదని అలాంటి శాఖలో డిప్యూటీ తాసిల్దార్ గా ఉద్యోగంలో చేరి వివిధ దశల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తూ ఎన్నో అవార్డులు సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఎన్నికల సందర్భంగా ఆయన ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉద్యోగులకు ఉన్నతాధికారులకు మంచి సమన్వయం కుదిర్చి విజయవంతంగా ఎన్నికలు పూర్తి కావడానికి తన వంతు కృషి చేశారన్నారు. పదవీ విరమణ అనంతరం జీవితం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.
జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ మాట్లాడుతూ రెవిన్యూ శాఖలో 30 ఏళ్లు అనుభవం గడించిన గణపతి రావు లాంటి వ్యక్తులు పదవి విరమణ తర్వాత కూడా ఏదో ఒక రూపంలో ప్రజా సేవ చేయాలని కోరారు. జిల్లా రెవెన్యూ అధికారిగా పదవీ విరమణ చేస్తున్న గణపతి రావు మాట్లాడుతూ ఉద్యోగంలోనే సంతోషం వెతుక్కోవడాన్ని ఆస్వాదిస్తానన్నారు. గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకోవడం, అలాగే తనకి ఎంతో ఇష్టమైన రచనల ద్వారా కొన్ని పుస్తకాలను ముద్రించడం సంతృప్తి నిచ్చాయన్నారు. తన పదవి విరమణ చివరి దశలో శ్రీకాకుళం జిల్లా ఎన్నికల నిర్వహణలో ఎన్నో అనుభవాలు గడించానని గుర్తు చేసుకున్నారు. తన బాధ్యతలను నిర్వహణలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
ఇదే రోజు పదవి విరమణ పొందుతున్న తాసిల్దార్ బలివాడ రాజమోహన్రావును కూడా ఈ సందర్భంగా కలెక్టర్, జెసిలు అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలాస, శ్రీకాకుళం ఆర్డీవోలు భరత్ నాయక్, సిహెచ్ రంగయ్య మాట్లాడుతూ పని ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండడాన్ని ఆయన నుంచి నేర్చుకున్నామన్నారు. సిపిఓ ప్రసన్న లక్ష్మీ మాట్లాడుతూ సహనం, ఓర్పునకు డిఆర్ఓ కేరాఫ్ అడ్రస్ అన్నారు. డిఆర్ఓ కుమారుడు హర్ష మాట్లాడుతూ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సాయిబాబాను ఆరాధించే వారిని గుర్తు చేసుకున్నారు. యువకులతో పోటీగా పనిచేసినట్టు ఆయనను చూస్తే కనిపిస్తుందని అన్నారు. జిల్లా పరిషత్ సీఈవో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మనిద్దరం కలిసి ఉత్తరాంధ్రలో అన్ని జిల్లాలలో పనిచేశామని, ఆయన ఎక్కడ పనిచేసినా కలెక్టర్ల మన్ననలను పొందే వారని, ఇష్టంతో పనిచేసి నప్పుడే ఆర్యోగ్యముగా ఉంటామని చెప్పేవారని, లాండ్ క్లినిక్ అనే యూ ట్యూబ్ చానెల్ పెట్టి భూ వివాదాలు పై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నించడం గొప్ప విషయం అన్నారు.
కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments