- కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపు
- "అరే మావ" యూట్యూబ్ ఛానల్ బృందానికి ప్రత్యేక అభినందనలు.
శ్రీకాకుళం: యువత తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడం తోపాటు మరిన్ని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. జిల్లాలోని రణస్థలం మండలానికి చెందిన రమణ నిర్వహిస్తున్న "అరే మావ" యూట్యూబ్ ఛానల్ 25 లక్షల మంది ఫాలోవర్లు సాధించిన సందర్భంగా ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. దాదాపు 200 మంది రక్తదానం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కేవలం వినోదానికి సంబంధించిన వీడియో లకే పరిమితం కాకుండా మొక్కలు నాటడం, యువతను చైతన్యం చేయడం వంటి సామాజిక కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. సిక్కోలు యువత అన్ని రంగాల్లో ముందున్నారని.. 2019లో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి, 25 లక్షల మంది ఫాలోవర్లను సాధించడం గర్వించదగిన విషయమన్నారు. రమణ, అతని బృందం భవిష్యత్తులో మరింతగా రాణించి, జిల్లా విశిష్టతను చాటాలని ప్రోత్సహించారు.
ఎచ్చెర్ల ఎమ్మెల్యేతో భేటీ..
రణస్థలం పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి కార్యకర్తలతో మాట్లాడారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయాలని సూచించారు. అంతకుముందు ఆయన.. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు ఇంటికి వెళ్లి కలుసుకున్నారు. నియోజకవర్గానికి సంబంధించిన ప్రజా సమస్యలు, అభివృద్ధిపై చర్చించారు. 3 పార్టీల సమన్వయంతో ఎన్డీఏ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్దామని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఫొటో 1: రక్తదాన శిబిరంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఫొటో 2: ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ తో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి
ఫొటో 3: టీడీపీ కార్యకర్తలతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
0 Comments