*ఉత్తరాంధ్రకే తలమానికం జెమ్స్ ఆసుపత్రి*
*రిమ్స్ , జెమ్స్ లను మెడికల్ హబ్ స్థాయికి తీసుకెళ్లాలి*
*మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు*
*సంజీవిని జెమ్స్ : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు*
శ్రీకాకుళం, ఆగస్టు 25 : ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో పాటు ఆరోగ్య సమాజం కోసం ఎంతో మంది వైద్యులను అందిస్తున్న జెమ్స్ ఆసుపత్రి ఇటు ఉత్తరాంధ్ర, అటు ఒడిశా కు తలమానికంగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశంసించారు. ఆదివారం నిమ్మాడ లోని క్యాంపు కార్యాలయంలో ఆయనను కిమ్స్, జెమ్స్ చైర్మన్ బొల్లినేని భాస్కరరావు ఆత్మీయ పూర్వకంగా కలుసుకున్నారు. అత్యాధునిక మౌలిక వసతులతో నిర్మించిన జెమ్స్ హాస్పిటల్, జేమ్స్ మెడికల్ కాలేజీ, బొల్లినేని స్కిల్ సెంటర్ లు, కొత్తగా విస్తరిస్తున్న కిమ్స్ ఆస్పత్రితో పాటు టెక్కలి జిల్లా ఆసుపత్రి, రిమ్స్ వైద్య కళాశాల, రిమ్స్ జనరల్ ఆస్పత్రి, మిగిలిన కార్పోరేట్ ఆసుపత్రులను అనుసంధానిస్తూ ఒక మెడికల్ హబ్ గా శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. వృత్తి నైపుణ్యాలను పెంపొందించి, యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించేందుకు స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం ప్రణాళికను రూపొందించాలని, ప్రభుత్వం తరపున తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం చుట్టూ త్వరలోనే రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. జెమ్స్ మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రి మెడికల్ యూనివర్సిటీ స్థాయికి చేరుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. మంత్రిని కలిసిన వారిలో జెమ్స్ సీఈవో బొల్లినేని అద్విత్, డైరెక్టర్లు డాక్టర్ కే సుధీర్, డాక్టర్ గూడెన సోమేశ్వరరావు, స్వర్ణ రామ్మోహన రావు తదితరులు ఉన్నారు.
*సంజీవిని జెమ్స్ :
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు*
జెమ్స్ ఆసుపత్రి జిల్లా ప్రజలకు మాత్రమే కాకుండా అటు ఒడిస్సా ఇటు ఉత్తరాంధ్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, వేలాది మంది ప్రజలకు ప్రతి నిత్యం ప్రాణ రక్షణ కల్పిస్తూ సంజీవనిగా సేవాలందిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కితాబిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని రామ్మోహన్ నాయుడు నివాసంలో కిమ్స్ అధినేత బొల్లినేని భాస్కరరావు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. జెమ్స్ భోధనాసుపత్రి ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కేన్సర్ రీసెర్చ్ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం పట్ల కిమ్స్ చైర్మన్ బొల్లినేని భాస్కరరావును కేంద్ర మంత్రి అభినందించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటైన తర్వాత జిల్లాలో మెడికల్ హబ్ కు కనెక్టివిటీ పెరుగుతుందని తద్వారా జిల్లా అభివృద్ధికి బాటలు వేయవచ్చని చెప్పారు. వైద్య కళాశాలలో సీట్ల సంఖ్యను మరింత పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నుంచి తాను తోడ్పాటునందిస్తానని ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.
0 Comments