టీడీపీ జాతీయ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించిన కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం: ప్రజా వినతులు ఆలకించడంతో పాటు వాటి పరిష్కారానికి కృషి చేయడం ప్రజా ప్రతినిధుల గురుతర బాధ్యతని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మంగళగిరిలో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీ లతో మంగళవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గ్రీవెన్స్ లో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కొన్నిటిని సంబంధిత అధికారులకు సిఫార్సు చేయడంతో పాటు మరికొన్నిటికీ అక్కడికక్కడే ఫోన్ చేసి, పరిష్కారించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ నిర్వహించడం సీఎం చంద్రబాబునాయుడుకే చెల్లిందన్నారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర మంత్రులను భాగం చేయడమే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. ఫిర్యాదులకు పరిష్కారం లభించే తరుణంలో అర్జీదారుల చిరునవ్వే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి బలం, ఆశీర్వాదమని వివరించారు.
0 Comments