ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి: జిల్లా కలెక్టర్

శ్రీకాకుళం:జిల్లాలోని పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాలని, పరిశ్రమల్లో పని చేసే ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండేలా, వారి ఆరోగ్యానికి హాని లేకుండా ఎలా పని చేయాలో తెలిపేలా యజమానులు తమ కార్మికులకు సరైన సమాచారం, సూచన, శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. జిల్లాలో అన్ని పరిశ్రమలు దీనిపై రానున్న రెండు వారాల పాటు సంపూర్ణ శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం ఆయన జిల్లాలోని భారీ, మధ్య తరహా పరిశ్రమల ప్రతినిధులతో అత్యవసర సమావేశంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తో కలసి మాట్లాడారు.

 పారిశ్రామిక యూనిట్లలో రసాయన ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. అమోనియా, క్లోరిన్, ఎల్పీజీ, బ్యుటెన్ వంటి మండే స్వభావం ఉన్న వాయువులను పెద్ద పరిమాణంలో వినియోగించే పరిశ్రమల్లో కట్టుదిట్టమైన భద్రత ప్రమాణాలు ఉండాలని, ఎప్పటికప్పుడు భద్రతా ప్రమాణాలపై తనిఖీలు నిర్వహించాలని, ఇప్పటికే పూర్తి చేసిన తనిఖీల నివేదిక ఆధారంగా అన్ని పరిశ్రమలు మార్గదర్శకాలు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవల కాలంలో విశాఖ జిల్లాల్లో పలు పరిశ్రమల్లో భద్రతా వైఫల్యాల కారణంగానే ప్రమాదాలు వాటిల్లాయని, అలాంటి వాటిని కట్టడి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వివరించారు. సమర్థవంతమైన రసాయన విపత్తు నిర్వహణ, అలాగే సంక్షోభ ప్రతిస్పందనకు పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ప్రణాళిక విభాగం, సెర్చ్, రెస్క్యూ యూనిట్, ఉపశమనం, పునరావాసం, కమ్యూనికేషన్, రవాణా, లాజిస్టిక్, చివరిగా అత్యవసర సమయంలో అన్ని వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటి అంశాలపై ఆయన సమీక్ష చేశారు.

సమావేశానికి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉమా మహేశ్వరరావు, ఏడీ రమణారావు, 
జిల్లా అగ్ని మాపక శాఖ అధికారి మోహనరావు పర్యావరణ శాఖ ఇంజనీర్ రామారావు నాయుడు, ఇంకా రెడ్డిస్ లాబొరేటరీస్, యునైటెడ్ బ్రేవరెస్, నాగార్జున అగ్రికెమ్, అరబిందో ఫార్మా, ఆంధ్రా ఆర్గానిక్, స్మార్ట్ కెమ్ టెక్నాలజీ, విశాఖ డెయిరీ, సరాఖ లాబ్ తదితర పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు.

Post a Comment

0 Comments