*వైద్య, రెవెన్యూ, పోలీసు శాఖలతో పాటు ఇతర శాఖలు అధికారులందరూ అందుబాటులో ఉండాలి అని ఆదేశం ప్రాణ, ఆస్తి నష్టం జరగకుంగా ముందస్తు చర్యలు తీసుకోవాలి*
*వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు*
శ్రీకాకుళం, అక్టోబర్ 22: బంగాళాఖాతంలో ఏర్పడిన 'దానా' తుఫాను పట్ల జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాను తీవ్రత నేపథ్యంలో ఈనెల 24 నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయని, వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో సముద్ర, నదీ తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎటువంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా ముందుస్తుగా అన్ని ఏర్పాట్లూ చేయాలని సూచించారు. అవసరమున్న చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేయాలని చెప్పారు. గండ్లు పడే అవకాశమున్న చెరువులు, కరకట్టలు, కాలువల పై నిఘా ఉంచి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న గ్రామాలను గుర్తించి అవసరం మేరకు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. వైద్య, రెవెన్యూ, పోలీసుశాఖలతో పాటు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంచాలని చెప్పారు. అత్యవసరమైన వారు ఫోన్‌లో సంప్రదించే విధంగా సౌకర్యం కల్పించాలని సూచించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ తుఫాన్ తీవ్రతపై క్షేత్ర స్థాయి సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు.
0 Comments