రధసప్తమి వేడుకలకు సీఎం ఆమోదం
త్వరలో ఉత్తర్వులు
ఎమ్మెల్యే గొండు శంకర్ వెల్లడి
ప్రత్యక్ష భగవానుడు, ఆరోగ్య ప్రధాత అయిన శ్రీ సూర్యనారాయణ స్వామి కొలువైన అరసవల్లి పుణ్యక్షేత్రంలో ప్రతి యేటా రధసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. మాఘ మాసంలో శుక్ల పక్షం సప్తమి తిథి రోజున సూర్య జయంతిని పురస్కరించుకుని రథసప్తమి పండుగను జరుపుకుంటారు. అరసవల్లిలో అంగరంగ వైభవంగా జరిగే రధసప్తమి వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అత్యంత విశిష్టత కలిగిన రధసప్తమి పర్వదినం ఇప్పటి వరకు జిల్లా వరకే పరిమితం కాగా, రానున్న రధసప్తమి రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నారు. ఈ మేరకు స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ రధసప్తమి పర్వదినాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వినతిపత్రం అందజేయగా అయన సానుకూలంగా స్పందించినట్లు గొండు శంకర్ తెలిపారు. ఇప్పటికే ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నట్టు వివరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన అరసవల్లిలో రధసప్తమి వేడుకలు రాష్ట్ర పండుగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు మ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. తన వినతి మేరకు సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకున్న సీ ఎం చంద్రబాబుకు, సహకరించిన కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెనాయుడులకు శంకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
0 Comments