ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

గీత కార్మికులకు పారదర్శకంగా షాపుల కేటాయింపు.

శ్రీకాకుళం, మార్చి 6: జిల్లాలో ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో కల్లు గీత కార్మికుల్లోని ఉప కులాలకు కేటాయించిన 18 షాపులకు జాయింట్ కలెక్టర్‌ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం లాటరీ తీశారు. గీత కార్మికులకు (శ్రీశయన, సెగిడి, గౌడ, యాత, సొండి) షాపుల కేటాయింపు ప్రక్రియను నగరంలోని డా॥ బి.ఆర్. అంబేద్కర్ కళావేదికలో పారదర్శకంగా పూర్తి చేశారు. జిల్లాలోని 18 షాపులకు మొత్తం 204 దరఖాస్తులు రాగా, లాటరీ ద్వారా శ్రీశయన కులానికి చెందిన 10 మందికి, సెగిడి కులానికి చెందిన 4 గురికి, గౌడ, యాత కులానికి ఒక్కొక్కటి చొప్పున, సొండి కులానికి చెందిన ఇద్దరికీ లాటరీ ద్వారా షాపులు కేటాయింపు ప్రక్రియను జాయింట్ కలెక్టర్ స్వయంగా లాటరీ ద్వారా నిర్వహించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ, కులం, స్థానికత, ఉప కులాన్ని నిర్ధారించే ధృవీకరణ పత్రాలు సమర్పించడంతో పాటు, నిర్దేశించిన మొత్తాన్ని రేపటి లోగా చెల్లించిన వారికే షాపులు కేటాయిస్తామని తెలిపారు. ఒకవేళ ఎవరైనా అనర్హతకు గురైతే మొదటి ప్రాధాన్యతలో వచ్చిన తర్వాతి వ్యక్తికి షాపులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి నాయుడు, ఇతర ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ లాటరీ ప్రక్రియను పూర్తిగా వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించారు.

Post a Comment

0 Comments