శ్రీకాకుళం రూరల్/ గార, ఆగస్టు 25: ఎన్డీయే కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, రేషన్ లబ్ధిదారులకు హక్కుగా అందించేందుకు స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభించామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శనివారం గార మండలం రామచంద్రపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామం, శ్రీకాకుళం నగర పరిధి కాజీపేట, రూరల్ మండలం సింగుపురం గ్రామాలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని 1,625 రేషన్ షాపుల ద్వారా 6,71,803 మంది లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభమైందని ఎమ్మెల్యే వివరించారు. ఇకపై అవకతవకలకు తావులేకుండా రేషన్ సరఫరా అవుతుందని తెలిపారు.
కొత్త కార్డుల్లో రాష్ట్ర చిహ్నం, కుటుంబ సభ్యుల వివరాలు, డిజిటల్ ట్రాకింగ్ సదుపాయం కల్పించినట్లు చెప్పారు. పిడిఎస్ బియ్యం రవాణాలో మోసాలను అరికట్టేందుకు డిజిటల్ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైన సేవల కోసం లబ్ధిదారులు మీసేవా కేంద్రాలను ఆశ్రయించవచ్చని సూచించారు. కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొన్నారు.
0 Comments