శ్రీకాకుళం, ఆగస్టు 26:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర రెడ్డి లతో మంగళవారం ఫోన్‌లో మాట్లాడి వరద పరిస్థితులపై పూర్తి సమాచారం సేకరించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు మంత్రి సూచించారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కాల్వలు, చెరువులు గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఇరిగేషన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
భారీ వర్షాల దృష్ట్యా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి సూచించారు. విద్యుత్, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారులు కలసి వర్షాల ప్రభావాన్ని అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే నివేదించాలని మంత్రి స్పష్టం చేశారు.
0 Comments