శ్రీకాకుళం, ఆగస్టు 26:ప్రకృతి సంరక్షణే దేశ సేవ, భగవంతుని సేవ అని కేంద్ర పౌర విమానాయశాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు అన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద మట్టి వినాయక ప్రతిమలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, మట్టి గణేశ ప్రతిమల వినియోగమే కాలుష్యరహిత సమాజానికి మార్గమని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ సహజ మట్టితోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని తెలిపారు. గత పదేళ్లుగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా అందిస్తున్నామని, ఈ సంవత్సరం పర్యావరణ శాఖ, క్రిడై సహకారంతో 30 వేలకుపైగా ప్రతిమలు, వ్రత పుస్తకాలు భక్తులకు పంపిణీ చేశామని వివరించారు. “మట్టి వినాయకున్ని పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం” అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని, నాగావళి, వంశధార వంటి జీవనదులను కాపాడుకోవడం అందరి బాధ్యత అని అన్నారు.
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మట్టి ప్రతిమలే శ్రేయస్కరమని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా నిమజ్జన సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, గుంపులుగా కాకుండా తక్కువ మందితో వేడుకలను పూర్తి చేయాలని భక్తులను కోరారు. ప్రతిసారీ మట్టి ప్రతిమలను అందిస్తున్న స్థానిక ఎమ్మెల్యే శంకర్ కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్విరాజ్ కుమార్, శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
0 Comments