శ్రీకాకుళం,అక్టోబరు,17: పెన్షన్లు కోసం ముందుగా అర్జీలు పెట్టుకున్న అర్జీదారులకు ఇప్పటికే కొంత మందికి పెన్షన్లు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్వాభిమాన్ దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ లో కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ లు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ మూడవ శుక్రవారం స్వాభిమాన్ దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇంత వరకు నిర్వహించే 11 శుక్రవారాల గ్రీవెన్స్ లో 169 అర్జీలు స్వీకరించినట్లు వివరించారు. ఇంత వరకు వచ్చిన అర్జీలలో పెన్షన్లు, మెడికల్, చిన్న చిన్న భూ సమస్యలు, బ్యాటరీ ట్రై సైకిల్స్, ట్రై సైకిల్స్, వినికి యంత్రాలు, తదితర వాటిపై వచ్చినట్లు పేర్కొన్నారు. కొంత మంది ఉపాధి అవకాశాలు కోసం అర్జీలు పెట్టుకోగా వారికి నైపుణ్యాభివృద్థి సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చి విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. ప్రతీ నెల జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తున్నామని జాబ్ మేళాల్లోనూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మెడికల్ సమస్యలకు సంబంధించి జిజిహెచ్, డిసిహెచ్ వారితో అక్కడికక్కడే పరిష్కారానికి ఆదేశాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గత నెల మూడవ శుక్రవారం స్వాభిమాన్ కు హాజరై కొన్ని బ్యాటరీ ట్రై సైకిల్స్, ట్రై సైకిల్స్, వినికిడి యంత్రాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. ట్రై సైకిల్స్, బ్యాటరీ ట్రై సైకిల్స్ మరమ్మతులకు గురైతే వాటి మరమ్మతులకు జిల్లా పరిషత్ లో ఒక రూం కేటాయించి అక్కడే మరమ్మతులు చేపడతారని చెప్పారు.
*స్వాభిమాన్ రోజునే ఉద్యోగుల గ్రీవెన్స్*
ప్రతీ నెల మూడవ శుక్రవారం నిర్వహిస్తున్న స్వాభిమాన్ రోజునే ఉద్యోగుల గ్రీవెన్స్ ఉంటుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు.
శుక్రవారం నిర్వహించే స్వాభిమాన్ కు 11 అర్జీలు స్వీకరించారు. స్వీకరించిన 11 అర్జీలలో పెన్షన్లు, బ్యాటరీ సైకిల్స్, తదితర వాటి గూర్చి అర్జీలు వచ్చినట్లు తెలిపారు. అర్జీలు స్వీకరణలో జిల్లా పరిషత్ సిఈఓ సత్య నారాయణ పాల్గొన్నారు. స్వాభిమాన్ లో వైద్య ఆరోగ్య శాఖ, రిమ్స్, ఎస్సీ కార్పొరేషన్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
0 Comments