శ్రీకాకుళం, జూన్ 9 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న నాడు – నేడు పనులు ఈ నెల 20నాటికి పూర్తి చేసి ఆన్ లైన్ నందు నమోదుచేయాలని సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం ఆయన ఛాంబరులో నాడు – నేడు పనులపై సంబంధిత అధికారులతో వీడియో సమావేశాన్ని జె.సి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు – నేడు పనులు జరుగుతున్న పాఠశాలల్లో మిగిలివున్న వాల్ ఆర్ట్స్, ఫర్నిచర్, గ్రీన్ బోర్డ్, ఇంగ్లీష్ ల్యాబ్, మరుగుదొడ్లు, తాగునీరు వంటి అన్ని పనులు ఎట్టిపరిస్థితిల్లోనూ ఈ నెల 20లోగా పూర్తికావాలన్నారు. పెయింటింగ్ పనులు ప్రారంభంకాని పాఠశాలల వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన సకాలంలో పనులు పూర్తిచేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు నాడు – నేడు పనులు పూర్తయినంతవరకు విధులకు హాజరుకావాలని, గైర్హజరు అయిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు – నేడు పనులు సకాలంలో పనిచేసేందుకు అధికారులు సహకరించాలని, నాడు – నేడు పనులతో విద్యార్ధుల భవిత ఆధారపడి ఉందని చెప్పారు. విద్యార్ధులకు నాణ్యమైన విద్యతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం, మానసిక ఉల్లాసానికి, ఉత్తేజానికి ఆటలు, క్రీడలు వంటివి ఉండేవిధంగా ఈ పాఠశాలలు రూపుదిద్దుకోనున్నాయని ఆయన చెప్పారు. విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతీ అధికారి బాధ్యతగా వ్యవహరించి సకాలంలో పనులు పూర్తయ్యేలా చూడాలని ఆయన అధికారులను కోరారు. అనంతరం నాడు – నేడు పనులు జరుగుతున్న పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు మరియు ఆ మండల విద్యాశాఖాధికారులు తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని, హాజరుకాని అధికారులకు చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖాధికారి మరియు సమగ్ర శిక్ష ఏ.పి.సిలు యం.ఇ.ఓలను, హెచ్.ఎంలను ఆదేశించారు. ఈ సమావేశంలో సమగ్ర శిక్ష ఏ.పి.సి పైడి వెంకటరమణ, ఇన్ ఛార్జ్ జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, కార్యనిర్వాహక ఇంజినీర్లు వి.వెంకటకృష్ణయ్య, భాస్కరరావు, సెక్టోరియల్ అధికారులు కృష్ణరాజు, సి.సుధాకర్, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
0 Comments