* ప్రతీ పేదవారికి స్థిరాస్తి ఏర్పాటు
* మొదటి దశలో జిల్లాకు 90 వేల 716 గృహాలు
* ప్రతి ఒక్క అక్కా చెల్లెమ్మలు ఆర్థికంగా పరిపుష్టి చెందాలి
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీ రంగనాధ రాజు
శ్రీకాకుళం : ఇళ్ల నిర్మాణం వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీ రంగనాధ రాజు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, పాడిపరిశ్రమాభిద్థి, మత్య్స శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ ,హౌసింగ్ ఎండి నారాయణ భరత్ గుప్తా, జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి లాఠకర్, అధికారులతో ఆయన నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు, వై.యస్.ఆర్ జగనన్న కాలనీల గృహనిర్మాణం పై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మందికి గృహాలు లేక కాలువ గట్లు పైనే చిన్న చిన్న గుడిసెలు నిర్మించుకొని నివాసాలు చేస్తున్నారని, ముఖ్యమంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇళ్ళు నిర్మించి ఇచ్చేందుకు వారికి మాట ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ సచివాయాలు, వాలంటీర్లను నియమించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హత గల పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీకి శ్రీకారం చుట్టారని, 17 వేల కాలనీలు నిర్మించడం జరుగుతుందన్నారు. కాలనీల్లో భూ సేకరణ అభివృద్ధి చేయడంతో పాటు భూగర్భ డ్రెయినేజీ, విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యం, తాగునీటి వంటి సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. అర్హత గల వారు సచివాలయంలో ధరఖాస్తులు చేసుకుంటే 90 రోజుల్లో పట్టాలు జారీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొదటి దశలో 90 వేల 716 గృహాలు నిర్మాణంనకు శంఖు స్థాపన చేయడమైనదని పేర్కొన్నారు. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలని కోరారు. ప్రతీ అక్క చెల్లమ్మలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఒక క్యాలెండర్ పెట్టి అమ్మ ఒడి, ఆసరా, వంటి సంక్షేమ పథకాలు అమలు చేయబడుతుందిని చెప్పారు. ప్రతీ పేదవారికి సుమారు 17 లక్షల రూపాయలు స్థిరాస్తి ఏర్పాటు చేసే గృహాలు నిర్మించడం జరుగుతుందన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక నోడల్ అధికారిని నియమిస్తే ఇళ్ల నిర్మాణాలు వేగవంతం అవుతాయని తెలిపారు. మరో 97 లేఅవుట్లు గుర్తించి అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. విద్యుత్ కనెక్షన్లు త్వరగా ఏర్పాటు చేస్తే నిర్మాణాలు ప్రారంభం అవుతాయన్నారు. నిర్మాణాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులను కలుపుకోవాలని చెప్పారు. లబ్ధిదారులు ఎవరైనా ఇళ్ల నిర్మాణాలకు ముందుకు వస్తే నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ సరసమైన ధరలకే ప్రభుత్వం సరఫరా చేస్తుందని పేర్కొన్నారు. నిర్మాణాలు చేపడితే స్వంత గ్రామంలోనే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉండి వలసలు నివారించవచ్చుని సూచించారు. బిల్లులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతాయన్నారు. శ్రీకాకుళం జిల్లా రాష్ట్ర స్థాయిలో గృహాలు నిర్మాణాల్లో ముందుండాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇళ్ల పట్టాలను ఇప్పటికే లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవారికి ఇళ్ల నిర్మాణాలు వచ్చే మార్చి నాటికి పూర్తి చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. గత కలెక్టర్ జె. నివాస్ చాలా బాగా పనిచేశారని, ప్రస్తుత కలెక్టర్ మరింత బాగా పనిచేస్తారని, అర్హత గల ప్రతీ పేద వారికి ఇళ్లు ఉండాలని పేర్కొన్నారు.
రాష్ట్ర పాడిపరిశ్రమ అభివృద్ధి, మత్య్స శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ప్రతీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారి నియమించేందుకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ని కోరారు. జిల్లాలో గృహ నిర్మాణ కార్యక్రమం విజయవంతంగా జరగాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 30 లక్షల గృహాలు నిర్మించడమనేది ఒక చారిత్రకమని పేర్కొన్నారు. గృహ నిర్మాణంలో జిల్లాను రాష్ట్రం స్థాయిలో మొదటి స్థానంలో నిలపాలని ఆయన కోరారు.
జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో పట్టాలు పంపిణీ, లే ఔట్లు, గృహాలు నిర్మాణానికి సంబంధించి వివరాలను మంత్రికి వివరించారు. వచ్చే మార్చి నాటికి గృహ నిర్మాణాలు పూర్తి చేసేందుకు తగు చర్యలు చేపడతామన్నారు. కోవిడ్ సమయంలో స్వ గ్రామంలోనే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గృహ నిర్మాలు వలసల నివారణకు ఉపకరిస్తాయని, ఎన్ని జాబ్ కార్డులు జారీ చేశారో చెప్పాలని డ్వామా పిడి ని అడుగగా జాబ్ కార్డులకు సంబంధించిన వివరాలను పిడి కూర్మారావు వివరించారు. శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ టెక్కలి నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయడమైనదని, లే ఔట్లు, ఇళ్ల నిర్మాణాలు, తదితర విషయాలను మంత్రికి వివరించారు. పాతపట్నం శాసన సభ్యులు రెడ్డి శాంతి మాట్లాడుతూ నియోజక వర్గంలో గృహ నిర్మాణాలు చేపట్టి త్వరిత గతిన పూర్తి చేయాలని కోరారు. రాజాం నియోజకవర్గం శాసన సభ్యులు కంబాల జోగులు మాట్లాడుతూ ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు నివాసం ఉంటున్నారని, ఇలాంటి వారికి గృహాలు మంజూరు చేయాలని కోరారు. పాలకొండ శాసన సభ్యురాలు విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ నియోజక వర్గంలో గృహ నిర్మాణాలు చేపట్టే స్థితిలో లబ్దిదారులు లేరని ప్రభుత్వమే నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకు ముందు జాయింట్ కలెక్టర్ హిమాంశు కౌశిక్ గృహ నిర్మాణాలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్, వి. కళావతి, కంబాల జోగులు, హౌసింగ్ ఛీఫ్ ఇంజనీర్ పి. శ్రీరాములు , జెసిలు సుమిత్ కుమార్, డాక్టర్ కె. శ్రీనివాసులు , హిమాంశు కౌశిక్, హౌసింగ్ పీడీ పి.వేణుగోపాల్, ఆర్డిఓలు కుమార్, కిషోర్, డ్వామా పిడి హెచ్. కుర్మారావు, మండలాల ప్రత్యేక అధికారులు, హౌసింగ్ డీఈలు, తదితరులు పాల్గొన్నారు.
శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్, శాసన సభ్యులు కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతి, రెడ్డి శాంతి, జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డా.కె.శ్రీనివాసులు, గృహ నిర్మాణ సంస్థ ఓఎస్డి శివ ప్రసాద్, చీఫ్ ఇంజినీర్ పి.శ్రీరాములు, పిడి టి.వేణుగోపాల్, రెవెన్యూ డివిజనల్ అధికారులు ఐ. కిషోర్, టివిఎస్ జి కుమార్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్.కుర్మారావు, ఇచ్చాపురం, పలాస, పాలకొండ మున్సిపల్ చైర్మన్ పిలక రాజ్యలక్ష్మి, బల్ల గిరిబాబు, యందవ రాధ కుమారి, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, పలాస డిసిసిబి మాజీ చైర్మన్ పాలవలస విక్రాంత్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments