ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

కారా మాస్టారు మృతికి కలెక్టర్ సంతాపం

శ్రీకాకుళం, జూన్ 4 : ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు(97) మృతి పట్ల జిల్లా కలెక్టర్ జె నివాస్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. జిల్లా సాహితీ లోకానికి తీరనిలోటని ఆయన అభివర్ణించారు. సాహిత్యంలో జిల్లాను గౌరవ స్ధానంలో నిలబెట్టారని, “కథానిలయం” స్ధాపించి కథలకు దేశంలోనే గొప్ప స్ధానం కల్పించారని పేర్కొన్నారు. కారా మాస్టారుగా సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడుగా ప్రసిద్ధి పొందారని పేర్కొన్నారు. సామాన్య పాఠకులను సైతం తన రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్యతగల సుప్రసిద్ధ రచనలు చేశారని అన్నారు. 
కారా మాస్టారు రాసిన 'యజ్ఞం' కథకు  1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తన రచనలకు గాను పలు కేంద్ర, రాష్ట్ర అవార్డులను కారా మాస్టారు పొందారు. వివిధ యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్‌ను పొందారు. తెలుగులో రాసిన ప్రతి కథనీ భద్రపరచాలనే ఆకాంక్షతో... 1997 ఫిబ్రవరి 22న శ్రీకాకుళం నగరంలో కథానిలయాన్ని రామారావు స్థాపించారు. కథా నిలయం, తెలుగు కథల సేకరణకు అంకితమైన ఒక గ్రంథాలయం. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ద్వారా తనకు లభించిన రివార్డుతో పాటు కొందరు సాహిత్యవేత్తల సహకారంతో 800 కథల పుస్తకాలను ఒక్కచోటకు తీసుకొచ్చి ఈ కథానిలయాన్ని ప్రారంభించారు.నేడు ఆ కథల సంఖ్య దాదాపు లక్షకు చేరుకుంది.

Post a Comment

0 Comments