శ్రీకాకుళం,ఆగస్టు 19:రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఆదేశాల మేరకు, జిల్లాలో ప్రత్యేక సమ్మరీ రివిజన్ 2025 షెడ్యూల్ కోసం బుధవారం నుంచి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవిన్యూ అధికారి ఎం అప్పారావు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో సోమవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఉపాధ్యాయ ఓటర్ల నమోదు కోసం సెప్టెంబర్ 30వ తేదీన షెడ్యూల్‌ను విడుదల చేస్తామని చెప్పారు. అలాగే 2025 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే విధంగా బుధవారం నుంచి జరిగే ఇంటింటి సర్వేలో బూత్ లెవెల్ ఆఫీసర్లు వారికి అవగాహన కల్పిస్తారన్నారు. సాధారణ కొత్త ఓటర్ల నమోదుకు, బదిలీకి, చిరునామా మార్పునకు, ఫోటో మార్చుకొనుటకు ఇప్పుడు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పీఎంజే బాబు (టిడిపి), రౌతు శంకరరావు (వైయస్సార్సీపి), లాస సోమేశ్వరరావు (బీఎస్పీ), రట్టి ప్రకాష్ రావు (సిపిఎం) పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.
0 Comments