శ్రీకాకుళం, ఆగస్టు 21: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 23న జరగనున్న గ్రామ సభలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. ఈ సభల్లో ప్రజలంతా పాల్గొనేలా చూడాలని, ఉపాధిహామీ పథకం క్రింద ప్రతిపాదించిన పనులపై విస్తృతంగా ఈ గ్రామ సభల్లో చర్చించాలని నోడల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జరిగే గ్రామసభల్లో ప్రజాప్రతినిధులు హాజరైయేలా ఎంపిడిఓలు చర్యలు చేపట్టాలని అలాగే ప్రతీ నోడల్ అధికారి విస్తృతంగా పాల్గొనాలని సూచించారు. గ్రామాలను సుస్థిర అభివృద్ది దిశగా నడిపించే విధంగా ఈ ఉపాధి పనులను గుర్తించాలన్నారు. ఈ గ్రామసభలపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కోరారు.
రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ గ్రామసభల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ పాల్గొని అనంతరం నోడల్ అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలో అన్ని గ్రామ పంచాయితీల్లో ఒకేరోజున గ్రామసభలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సభల్లో అర్ధవంతమైన చర్చ జరగాలని, ప్రతీ గ్రామ సభకు ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ ఎన్.వి చిట్టి రాజు, డిప్యూటీ సీఈవో ఎన్. వెంకట్ రామన్ హాజరయ్యారు.
0 Comments