శ్రీకాకుళం, ఆగస్టు 21 : జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్పీఓ)ల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగిన రైతు ఉత్పత్తిదారుల సంస్థ జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు మెరుగైన, నాణ్యమైన పంటలను ఉత్పత్తి చేయడానికి ప్రోత్సహించాలని, వ్యవసాయ ఉత్పత్తి ఖర్చును తగ్గించడం ద్వారా రైతులు ఆదాయం పొందేందుకు వీలుంటుందని చెప్పారు. ఇందుకోసం మెరుగైన సాంకేతికత, మార్కెటింగ్ సౌకర్యం తదితర వాటి కోసం సన్న చిన్న కారు రైతులు ఎఫ్పీఓలో చేరి భాగస్వామ్యం కావడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయన్నారు.
రైతులు పండించే పంటలకు పకడ్బందీ మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల బలోపేతానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సన్న, చిన్న కారు రైతులు ఎఫ్పీఓ (ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్)లో భాగస్వాములు కావాలన్నారు. ఆర్థిక బలం తోపాటు మార్కెట్ అనుసంధానం పెంపొందించుకోవడానికి ఎఫ్పీఓలు దోహదపడతాయని వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్), వివిధ సంస్థల ఆధ్వర్యంలో 32 ఎఫ్పీఓలు పనిచేస్తున్నట్లు వివరించారు. కొత్తవి ఏర్పాటు చేసుకునేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో అమలు చేసే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు సంబంధించిన అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలో పాలు, కూరగాయలు, మామిడి, జీడి మామిడి, కొబ్బరితో పాటు ఉద్యానవన పంటల మార్కెటింగ్ పై ఎఫ్పీఓలు దృష్టి పెట్టాలన్నారు. పండించిన పంట ఉత్పత్తులను నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని, రైతు బజార్లలో రిటైల్ దుకాణాలు ఇవ్వాలని, లైసెన్సులు జారీ సులభ తరం చేయాలని ఆయా ఎఫ్పివో లు కలెక్టర్ ను కోరారు. ఈ మేరకు పెండింగ్ లేకుండా అన్ని రకాల లైసెన్సులు మంజూరు చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి కే.శ్రీధర్ ను కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో డీఆర్డిఏ పీడీ పి.కిరణ్ కుమార్, డిసిసిబి సీఈవో వర ప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్ కిరణ్ కుమార్, నాబార్డు డీడీఎం కృష్ణ, కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ బాగ్యలక్ష్మి, పశు సంవర్ధక శాఖ జేడీ జయరాజు, రెడ్ క్రాస్ ఛైర్మన్ పి.జగన్ మోహన్ రావు, బెజ్జిపురం యూత్ క్లబ్ ప్రతినిధి ప్రసాద రావు, జిల్లాలోని పలువురు ఎఫ్పిఓలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments