ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఉచిత ఇసుకపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు: జిల్లా కలెక్టర్

శ్రీకాకుళం, ఆగస్టు 22 : జిల్లాలో ఉచిత ఇసుక కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు పట్టిష్ట ప్రణాళిక సిద్ధం చేసామని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఇసుకపై ఫిర్యాదులకు 18004256012 టోల్ ఫ్రీ నెంబర్, 9701691657 వాట్సాప్ నంబర్ 24 గంటలూ పనిచేస్తాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్, జిల్లా ఎస్పీ కె వి మహేశ్వర రెడీ తో కలసి మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం కొత్తూరు మండలం అంగూరు వద్ద స్టాక్ యార్డ్ ఏర్పాటు చేశామని, అక్కడికి వచ్చే ట్రక్కులలోకి ఇసుకను లోడ్ చేయబోయే తేదీ, సమయాన్ని సరిగ్గా పేర్కొంటూ బుకింగ్ రశీదును జారీ చేస్తామని చెప్పారు. ప్రతి కేటగిరీ వాహనంపై కిలో మీటరుకు, మెట్రిక్ టన్నుకు రవాణా ఛార్జీలను ఖరారు ఖరారు చేసామన్నారు.

 ఇసుక రవాణా చేసే వాహనాలు తప్పనిసరిగా ఆర్టీవో కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితమని, రిజిస్ట్రేషన్ లేని వాహనాలు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఇసుక రవాణాకు సంబంధించి రవాణాదారులు ఎలాంటి ఉల్లంఘనలు చేసినా అన్ని సంబంధిత శాఖలు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్టాక్ యార్డు వద్ద ఎటువంటి వాహనం అనవసరంగా వేచి ఉండకుండా చూస్తామని, ఇసుక కార్యకలాపాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా పర్యవేక్షించేందుకు స్టాక్ యార్డులకు సమీపంలో రెవెన్యూ/పోలీస్/పంచాయతీలతో కూడిన ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

అంగూరు, సోమరాజుపురం లో సచివాలయం లో బుకింగ్ కేంద్రం సిద్ధం చేశామని, ఈ బుకింగ్ కేంద్రంలో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలని, ప్రతీ స్లాట్ లో రెండేసి గంటలకు సమయం కేటాయించి కనీసం 15 వాహనాలకు లోడింగ్ అనుమతి ఇస్తామని, బుకింగ్ కేంద్రం ఉదయం 6.00 గంటలనుండి సాయంత్రం 6.00 గంటల వరకు మాత్రమే పని చేస్తుందన్నారు. రాత్రి వేళల్లో ఇసుక రవాణా నిషేధించామని స్పష్టం చేశారు. 

లోడింగ్, ఇతర ఖర్చులు కలుపుకొని ఇసుకను టన్ను రూ.340 ధర నిర్ధారించినట్లు చెప్పారు. పది మెట్రిక్ టన్నులకు 10 కిలోమీటర్ల పరిధిలో రూ.1633 రవాణా చార్జీలను నిర్ణయించామని, 15 కిలోమీటర్ల పరిధికి రూ.2035, 20 కిలోమీటర్ల పరిధికి రూ.2438, 35 కిలోమీటర్ల పరిధికి రూ.3668 చొప్పున ధరను నిర్ధారించినట్లు వివరించారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టడం కోసం పైడి భీమవరంలో నిరంతరాయంగా పనిచేసేలాగా చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో మైన్స్ ఉప సంచాలకులు సత్యనారాయణ కూడా ఉన్నారు.

Post a Comment

0 Comments