శ్రీకాకుళం:మనిషి ప్రాణాలను నిలిపే రక్తం ప్రాణాపాయ స్థితిలో అందక చనిపోతున్న వారి సంఖ్య చాలానే ఉంటోందని, అలాంటి పరిస్థితిలో ఉన్న వారితో తమకు బంధుత్వాలు లేకున్నా తమ రక్తాన్ని పంచి రక్తబంధాన్ని కలుకొంటూ తమదైన రీతిలో సమాజానికి సేవ చేస్తున్న వారే రక్తదాతలని వారు ప్రాణదాతలతో సమానమని శ్రీకాకులం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి జిల్లా యువత ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌జీవో హోంలో ఆదివారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గొండు శంకర్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మెగస్టార్ చిరంజీవి అభిమానులు నగరంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఇది అభినందనీయమని చెప్పారు. జిల్లాలో రక్తనిల్వల కొరత ఎక్కువగా ఉందని యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలన్నారు. లక్షల కోట్లు ఖర్చు చేసినా కృత్రిమంగా తయారు చేయలేని రక్తాన్ని దాతలు మాత్రమే ఇవ్వగలరని చెప్పారు. అనుమానాలు, అపోహలకు పోయి రక్తదానం చేయడానికి ముందుకు రాని చాలా మందిలో రక్తదానం మూలంగా ఎలాంటి ఇబ్బందులు లేవనే నమ్మకాన్ని మెగా అభిమానులు కలిగిస్తూ తాము చేస్తూ.. మరొకరితో చేయిస్తూ.. క్షతగాత్రుల ప్రాణాలు కాపాడుతున్నారని తెలిపారు. అభిమాన సంఘాలు చేస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని చెప్పారు. మెగా అభిమానులు చేస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. మీ అందరి ఆశీస్సులతో చిరంజీవి నిండు నూరేళ్లు సంతోషంగా జీవించి ప్రజలకు ఎన్నో సందేహాత్మక చిత్రాలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మెగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
0 Comments