శ్రీకాకుళం: జిల్లాలోని మత్స్యకార గ్రామాలు, మారుమూల పల్లెల సమగ్ర అభివృద్ధి, యువతకు అండగా నిలిచేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. ఈ మేరకు సామాజిక బాధ్యతగా సీఎస్ఆర్ నిధులను కేటాయించి, వాటిని సద్వినియోగం చేయాలని కోకాకోలా సంస్థ ప్రతినిధులకు సూచించారు. కోకాకోలా సంస్థ సమాచార, ప్రజా సంబంధాల విభాగం ప్రధాన అధికారి హిమాన్షు ప్రియదర్శి, ఇతర ప్రతినిధులతో నగరంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం భేటీ జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని మత్స్యకార గ్రామాల్లో వీధి దీపాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించే విధంగా ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయడంపై కేంద్ర మంత్రి పలు సూచనలు చేశారు. అలాగే యువతకు నైపుణ్య శిక్షణ అందించి.. వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా కృషి చేయాలని కోరారు.
క్రీడలకు ప్రాధాన్యం..
జిల్లా నుంచి ఏటా వేలాది మంది యువకులు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగ ఎంపికలకు సాధన చేస్తున్న నేపథ్యంలో.. షార్ట్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకు కూడా శిక్షణ అందించాలని కోకాకోలా ప్రతినిధులను రామ్మోహన్ నాయుడు కోరారు. దీని వల్ల కేవలం కింది స్థాయి ఉద్యోగులకు మాత్రమే కాకుండా ఆఫీసర్ కేడర్ ఉద్యోగాలు కూడా సిక్కోలు యువత సాధించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే క్రీడలకు నెలవైన శ్రీకాకుళం జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించేలా మెగా టోర్నమెంట్ నిర్వహించాలని సూచించారు. క్రీడాకారులకు మరింత మెరుగైన శిక్షణ, సీనియర్ కోచ్ లను అందించేందుకు సంస్థ తరఫున సహకారం అందించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కోకాకోలా ప్రతినిధులు.. సమగ్ర ప్రణాళికతో ముందుకు వస్తామని వివరించారు.
ఫొటో : కోకాకోలా ప్రతినిధులతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
0 Comments