అభివృద్ధికి అవకాశం ఉన్న అన్ని రంగాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు అధికారులంతా చిత్త శుద్ధితో పని చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. కీలక శాఖల 100 రోజుల కార్యాచరణ నివేదికలపై శాఖల వారీ ఉన్నతాధికారులతో బుధవారం నుంచి సమీక్షలు నిర్వహించి దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో 100 రోజుల పనుల ప్రగతి, లక్ష్యాలపై జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ తో కలసి జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్, ఎంపిడివోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి సిబ్బందితో మాట్లాడారు. జిల్లాలో ప్రగతిని వేగవంతం చేసేందుకు వంద రోజుల సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, ఆ నివేదికల ఆధారంగా పక్కా ప్రణాళికతో కార్యాచరణ చేపడతామని పేర్కొన్నారు.
రెవెన్యూ శాఖపై మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా ప్రీ హోల్డ్ భూముల రికార్డుల పరిశీలన కార్యక్రమం పూర్తి చేయాలని, పరిశీలన పూర్తయ్యాక లోటు పాట్లు ఏమైనా ఉంటే ప్రభుత్వ నిర్ణయం మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఉపాధి హామీ పనుల లేబర్ బడ్జెట్, ఇళ్ల నిర్మాణాల పురోగతి, ఈ పంట నమోదు, తదితర అంశాలలో నిర్దేశించిన ప్రగతి లక్ష్య సాధనలో కొంతమంది మండల క్షేత్ర స్థాయి అధికారులు తక్కువ ప్రగతి సాధిస్తున్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, టైం బాండ్ కేసులు, డైరెక్షన్స్, ధిక్కార, రిట్ పిటిషన్లపై సరైన కౌంటర్లు ఫైల్ చేయాలన్నారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ లేఅవుట్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహాయంతో చేపడుతున్న గృహ నిర్మాణాలు, వాటి పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు చేపట్టిన పనులకు చెల్లింపులు కూడా జరిగినట్లు, ఇకపై ప్రగతి సాధించకుంటే ఉపేక్షించబోమని హెచ్చరించారు. డంపింగ్ యార్డులో కాకుండా రోడ్డు మీద చెత్త కనిపిస్తే ఆ పంచాయితీ సెక్రటరీ పై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఓటర్ల జాబితా రూపొందించడంలో అలసత్వం పనికిరాదని, ఈనెల 20వ తేదీ లోపు ఇంటింటి సర్వే నూరు శాతం పూర్తి చేయాలన్నారు. అన్ని పాఠశాలల్లో ఫిర్యాదుల బాక్స్ లు ప్రత్యేకించి విద్యార్ధినుల కోసం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
స్వర్ణ గ్రామాల సాధనలో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల అవసరాలకు అనుగుణంగా గుర్తించిన అభివృద్ధి పనులను మొదలు పెట్టేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. పండ్లతోటల పెంపకం, భూగర్భ జలాల పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు పెంపకం, పశు సంరక్షణలో భాగంంగా షెడ్ల ఏర్పాటు, పశుగ్రాస పెంపకం వంటి పనులతో పాటు అభివృద్ధి పనుల్లో భాగంగా వివిధ భవనాల నిర్మాణం, సీసీ రహదారులు, డ్రెయిన్లు, చెరువుల పూడికతీత వంటి అనేక కార్యక్రమాలను ఇప్పటికే గుర్తించామని, ఈ పనులు పూర్తయితే గ్రామాల్లో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
ఈ కాన్ఫరెన్స్ లో జిల్లా రెవిన్యూ అధికారి అప్పారావు, జిల్లా పరిషత్ సీఈవో ఆర్.వెంకట్ రామన్, సీపీవో ప్రసన్న లక్ష్మి, ఐసిడిఎస్ పీడీ బి.శాంతి శ్రీ, జిల్లా వ్యవసాయ శాఖాధికారి కే.శ్రీధర్, డిఎంహెచ్ఓ బి.మీనాక్షి, పలు శాఖల అధికారులు, అన్ని మండల తహశీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments