ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

'దానా' తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

శ్రీకాకుళం, అక్టోబర్ 22: బంగాళాఖాతంలో ఏర్పడిన 'దానా' తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. తుఫాను తీవ్రత నేపథ్యంలో ఈనెల 24 నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయని, సముద్ర, నదీ తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలు, తహసిల్దార్లు, పంచాయతీరాజ్, ఎన్ఆర్జీఈఎస్ ఏపీవోలు, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులతో మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడారు.


జిల్లాలోని నదులు, వాగుల్లో ప్రవాహం పట్ల అప్రమత్తంగా ఉండాలని, కాజ్ వే, వంతెనలపై నీరు ప్రవహించే చోట్ల పాదచారులు, వాహన చోదకులను నియంత్రించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ నెం:08942-240557 ఏర్పాటు చేశామని, ప్రజలు అత్యవసర సమయంలో ఫోన్ చేయాలని, సిబ్బంది వెంటనే అప్రమత్తమై తగు సహాయం చేస్తారని అన్నారు. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేయాలని చెప్పారు. గండ్లు పడే అవకాశమున్న చెరువులు, కరకట్టలు, కాలువల పై నిఘా ఉంచి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వరద ముంపు నకు గురయ్యే అవకాశం ఉన్న గ్రామాలను గుర్తించి అవసరం మేరకు వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. లైఫ్ బోట్లు, కూలిన చెట్లను తొలగించే యంత్రాలు, కొత్త స్తంభాలు సిద్ధంగా ఉంచుకోవాలని, తుఫాను రక్షిత భవనాలను సిద్ధం చేయాలని మళ్లీ ఆదేశాలు ఇచ్చేంతవరకు ఎవరూ వారి పని చేస్తున్న కేంద్రాలను విడిచి ఎవరూ వెళ్ళరాదని, ప్రభుత్వ అధికారులకు సెలవులను పూర్తిగా రద్దు చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు. పారిశుద్ధ్యం విషయంలో జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

ఒడిశా తో సమన్వయం అవసరం :
జిల్లాలో ప్రవహిస్తున్న నాగావళి, వంశధార, మహేంద్ర తనయ, బహుదా నదుల్లో నదీ ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గంజాం, గజపతి జిల్లాల అధికారులతో సమాచారం బట్వాడా చేసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని పని చేయాలని, ఎక్కడా ప్రాణ నష్టం జరగకూడదని చెప్పారు.

ప్రత్యేక అధికారుల నియామకం :
తుఫాను ముందస్తు చర్యలలో భాగంగా జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాలకు ప్రత్యేక పర్యవేక్షక అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అదేశాలు జారీ చేశారు. వీరితో పాటు జిల్లాలోని 30 మండలాలలో తహశీల్దార్‌లను వారి వారి మండలాల్లో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు. తీర ప్రాంత మండలాలైన రణస్థలానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్, పి.కిరణ్ కుమార్ (ఫోన్ :8008803800), ఎచ్చర్లకు డ్వామా పీడీ, బి.సుధాకర్ రావు (ఫోన్:8790008399), శ్రీకాకుళం మండలానికి జిల్లా పంచాయతీ అధికారి, కే.భారతి సౌజన్య (8341493877), గారకు ఐసిడిఎస్ పీడి, బి.శాంతి శ్రీ (9440814582), పొలాకికి జిల్లా పరిషత్ సీఈవో, శ్రీధర్ రాజు రామన్ (9100997770), సంతబొమ్మాళికి జిల్లా పరిశ్రమల శాఖ, జనరల్ మేనేజర్ ఉమామహేశ్వర రావు (9866530885), వజ్రపు కొత్తూరుకు మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్, పివి. శ్రీనివాసరావు (9440716028), సోంపేటకు కార్మిక శాఖ సహాయ కమిషనర్, అజయ్ కార్తికేయ (9492555034), మందసకు పశుసంవర్ధక శాఖ పలాస సహాయ సంచాలకులు, పి చంద్రశేఖర్ (9492416700), కవిటికి ఉద్యాన శాఖాధికారి ఆర్వివి ప్రసాద్ (7995086758), ఇచ్చాపురం మండలానికి డ్వామా ఏపిడి సిహెచ్.శ్రీనివాస్ రెడ్డి (6309998070)లను తుఫాను పర్యవేక్షక అధికారులుగా నియమించామని కలెక్టర్ చెప్పారు.

Post a Comment

0 Comments