ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

అన్ని హామీలు అమలు చేస్తాం. మంత్రి అచ్చన్న

కోటబొమ్మాలి, అక్టోబర్ 25 : 21వ అఖిల భారత పశు గణనలో భాగంగా అక్టోబర్ 25 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు రాష్ట్రంలోని 1.50 కోట్ల కుటుంబాలకు చెందిన పశు వుల వివరాలను నమోదు చేయనున్నట్లు వ్యవసాయ, పశుసంవర్ధక, సహకార, మత్స్య శాఖా మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కోటబొమ్మాలి మండలం పెద్ద బమ్మిడిలో శుక్రవారం ఉదయం పశు గణనను శాఖ మంత్రిగా ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గణనలో వ్యవసాయ పరికరాల వివరాలనూ సేకరిస్తారని, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, భూమిలేని కుటుంబాలకు ప్రధాన ఆదాయవనరుగా ఉన్న పశుసంవర్ధక రంగాన్ని మెరుగుపరచడానికి అవసరమయ్యే నిధులు, పథకాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.  

రాష్ట్రవ్యాప్తంగా 17,244 గ్రామాలు, పట్టణాల్లోని 3,929 వార్డుల్లో గృహ, గృహేతర వ్యక్తుల నుంచి వివరాలు తీసుకుంటారని, ఇందుకోసం 5,390 మంది సిబ్బంది, 1,237 మంది పర్యవేక్ష కులు, 45 మంది స్క్ర్కూటినీ అధికారులు, ఇతర సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారని వివరించారు. వీరికి ట్రావెలింగ్ కిట్లు, 60వేల వాల్పోస్టర్లు, 1.50కోట్ల గృహస్టిక్కర్లు, 8వేల ఐడీ కార్డులు అందించామని పేర్కొన్నారు. పశుగణన పూర్తయిన ఇంటి తలుపుపై స్టిక్కర్ వేస్తామని అన్నారు.

తమ ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని, అందులో భాగంగానే దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయలు పింఛను ప్రతి నెల ఒకటో తేదీన అందిస్తున్నామని చెప్పారు. ఈ దీపావళి నుంచి ఏటా మూడు సిలిండర్లు ప్రతి నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఇస్తున్నామని ప్రకటించారు.  అమ్మకు వందనం జనవరి నెలలో ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆ దిశగా కృషి చేస్తున్నామన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కూడా వీలైనంత త్వరగా ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా.. అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టి ముందుకు సాగుతున్నామన్నారు. ప్రభుత్వంపై ఎంతో బృహత్తర బాధ్యత ఉన్నదని అచ్చెన్నాయుడు వివరించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. మురళీధర్, డివిజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వి. జైరాజ్, జిల్లా జనాభా లెక్కల నోడల్ అధికారి డాక్టర్ జి. నారాయణరావు, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం. లోకనాధం, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఎం. ప్రజ్ఞాచైతన్య, పశుసంవర్ధక సహాయకుడు, సెన్సస్ ఎన్యుమరేటర్ ఎం. బలరాం, మాజీ ఎంపీటీసీ రామకృష్ణ, వెలమ విజయలక్ష్మి, పూజారి శైలజ, మాజీ సర్పంచ్ శిమ్మ నారాయణరావు, స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments